ఛాలెంజి..ఛాలెంజి...ఛాలెంజి 3




రేపటి నుండే పరీక్షలు .... కనీసం ఈ ఒక్క సాయంత్రం అయినా చదవాలి అనే ధృడ సంకల్పం తో.... టీవీ ఆన్ చేశాను."దూరదర్శన్ కేంద్రం, హైదరాబాద్. వార్తలు చదువుతుంది శాంతిస్వరూప్, ఈనాటి ముఖ్యాంశాలు" అని శాంతిస్వరూప్ వార్తలు నిదానంగా చదవటం మొదలుపెట్టాడు. ఈ వార్తలు వింటుంటే నాకు నిద్ర వస్తుంది. టీవీ ఆఫ్ చేశాను.

చదవటం అంటూ మొదలు పెడితే అదే అలవాటు అవుతుంది అని సైన్సు టెక్స్ట్ బుక్ తీశాను. "పరిసరాలు పరిశుభ్రత " పాఠం చదువుదామని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఆ పాఠం లో బొమ్మలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.

చిలకమ్మ కొట్టు నుండి కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చిన మా అమ్మ, నన్ను చూసి అశ్చర్య, భయ, సంతోషాలకి లోనయింది .

మా అమ్మ : ఏరా చిన్నా, పుస్తకాలతో నీకు ఏం పని రా...

నేను : చదువుకుంటున్నాను అమ్మా ..

మా అమ్మ : అవునా ...ఎప్పుడో చిన్నపుడు నీ విద్యాభ్యాసం అప్పుడు చూశాను పుస్తకం పట్టడం...మళ్ళీ ఇప్పుడే చూడటం కదా .... అందుకే కళ్ళలో నిరు నిండాయి... సరిగ్గా కనిపించలేదు

నేను : సర్లే కానీ, ఉరికే ఇలా నన్ను మాట్లాడించకమ్మా, చదువుకుంటున్నాను ...నా కోసం ఏ వెధవ వచ్చినా నేను లేను అని చెప్పు .... వెళ్ళి హార్లిక్స్ బాటిల్ తీసుకోని రా ....తింటూ చదువు కుంటా ....

ఇంతలో ప్రనిల్ గాడు మహేష్ మహేష్ అంటూ వచ్చాడు ....

మా అమ్మ : నీకు వంద ఏళ్ళు ప్రనిల్, ఇప్పుడే మా వాడు నీ గురించి ఇలా చెప్తున్నాడు, నువ్వు అలా వచ్చావు. మా అమ్మ అలా హార్లిక్స్ బాటిల్ కోసం లోపలి వెళ్ళింది ...

ప్రనిల్ : ఎమైంది రా ...ఎవరు ఏమన్నారు నిన్ను, ఏదయినా ఉంటే మాట్లాడుకుంటే సరిపోతుంది కదా ... ఇలా పుస్తకం పడితే సమస్యలు పరిష్కారం కావురా ... అయినా ఇప్పుడు ఇలా చదివి ఏం చేస్తావ్ రా ..

నేను : బాగా కష్టపడి చదివి కలెక్టర్ అవుతాను ...

ప్రనిల్ : కష్టపడి చదవటం అంటే, ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చొని చదవటం కాదు రా ... వీధిదీపాల కింద కూర్చొని చదవాలి.. అప్పుడే కలెక్టర్ అవుతావు ..... సినిమాల్లో చూపిస్తారు కదరా ....

నేను : అవును రా ... అయినా నాకు కలెక్టర్ కంటే ఫ్యాన్ అంటేనే ఇష్టం లే ..... నువ్వు కూడా చదువుకోరా .. రేపు మళ్ళీ ఫణి గాడు చూపించలేదు అని ఏడుస్తావు.
ప్రనిల్ గాడు అలా వెళ్ళిన పది నిమిషాలకి ... సీత ఈసారి చేతిలో గిన్నె తో ... ఆంటీ ఆంటీ అంటూ వచ్చింది .....
నేను : ఏం కావాలి సీతా ...

సీత : ఏం లేదు ... ఒక గుప్పెడు కంది పప్పు కావాలి అని అమ్మ పంపింది ....

నేను : గుప్పెడు అని చెప్పి గిన్నెడు పట్టుకు పోతావు ..... అయినా మేము ఎందుకు ఇవ్వాలి మీకు ....మొన్న లడ్డూలు చేసుకొని కనీసం ఒక రెండు రూచి చూడమని కూడ ఇవ్వలేదు కదా మీరు ....

సీత : మరిచిపోయాను మహేష్ .... పోనీ ఇప్పుడు తీసుకుని రానా ....

నేను : మాకు వద్దు లే .....అడిగి తీసుకుంటే అడుక్కున్నారు అంటారు అంతా ..... రేపు స్కూల్ కి వచ్చేటప్పుడు లంచ్ బాక్స్ లో తీసుకుని రా ....

సీత : సరే అలాగే తీసుకొస్తాలే ... ఆంటీ ఉన్నారా.....?

నేను : మా తాత్తయ్య పుట్టినరోజుకి, వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది ....

సీత : లేదే .... ఇందాకనే చూశాను నేను ఆంటీ నీ ...

నేను : ఇప్పుడే telegram వచ్చింది...ఇందాకే వెళ్ళింది ....

సీత : అయ్యో మరి నీకు భోజనం ఎలా ....పద మా ఇంట్లో తిందాం గాని...

నేను : ఏంటి ఇది అంతా నా మీద అభిమానమే!!!...తట్టుకోలేకపోతున్నా సీతా ...

అమ్మా, సీత కి గిన్నెడు కంది పప్పు కావాలి అంట ...ఇచ్చి పంపు....అలాగే కరివేపాకు కూడా ఇచ్చి పంపు....లేకుంటే మళ్ళీ వస్తుంది...ఆంటీ ఆంటీ అంటూ ......
సీత కంది పప్పు, కరివేపాకు తో విజయవంతంగా వాళ్ళ ఇంటికి వెళ్ళింది.

అందరినీ అలా పంపించి ఇలా టెక్స్ట్ బుక్ లో మొద్దటి లైన్ చదవగానే , నా వీపు నేల వైపు ఒరగటం మొదలుపెట్టింది. టెక్స్ట్ బుక్ లో అక్షరాలు మసక మసక గా కనబడుతున్నాయి.ఈ లక్షణాలు అన్నీ నిద్రవే అని కనిపెట్టిన నేను లేచి, అటు ఇటు తిరుగుతూ చదివాను. అర్ధగంట లో ఆరు పేజీలు చదివాను. మనిషి అనేవాడు ఎవ్వడూ అరగంటకి మించి చదవలేడు. నాకు ఇప్పుడు విరామం కావాలి ... టీవీ ఆన్ చేశాను. శాంతిస్వరూప్ వెళ్ళిపోయాడు .... చిత్రలహరి మొదలయ్యింది. టీవీ సౌండ్ పెంచాను. ఎప్పుడూ చిరంజీవి సినిమా పాటతో మొదలయ్యే చిత్రలహరి ఈసారి శోభన్ బాబు పాటతో మొదలయ్యింది. "గాలి వాన లో, వాన నీటిలో ...." . ఈ పాట వినలేక టీవీ ఆఫ్ చేయబోతే

"టీవీ మీద చేయి పెడితే, చేతికి వాత పెడతా.." అన్నారు శోభన్ బాబు ఫాన్స్ ...అదే, మా అమ్మ... వంట గది నుండి

నేను : "శోభన్ బాబు కోసం ఈ మహేష్ బాబు కి వాత పెడతావా ...." ఈ చేదు నిజాన్ని అబద్ధం అని చెప్పమ్మా ... చెప్పు.

"నేను ఏదైనా ఒక సారే చెప్తాను చిన్నా, రెండో సారి చేసి చూపిస్తాను. చూపించమంటావా .....?" అని చాలా నెమ్మదిగా చెప్పింది మా అమ్మ .

టీవీ ని కొద్ది సేపు మా అమ్మ కి అప్పగించి, తెలుగు టెక్స్ట్ బుక్ తీసుకుని అలా నా పడక గది లోకి వెళ్లి మంచం ఎక్కాను ... పది నిముషాలు అలా తీక్షణంగా పుస్తకం లోకి చూశాను ...ఒక దోమ నన్ను కుడదామని నా చేతి మీద వాలింది ...పాపం దానికి ఏమి తెలుసు ...అది వాలింది పులి మీద అని .... దానిని ప్రాణాలతో పట్టుకొని, దాని రెక్కలనుండి విరిచేసి వేరుగావించి నా టెక్స్ట్ బుక్ మీద వదిలేసి దానితో ఆడుకుంటున్నాను. దానికి అర్ధమైనట్లు ఉంది ..."దోమ గా పుట్టడం ఎంత దురదృష్టమో". క్షమాభిక్ష కోసం ధీనంగా చూసింది. అ చూపు నేను మా నాన్న వైపు, నన్ను కొడుతున్నపుడు చూసే చూపు లాగా ఉంది. అ చూపు మా నాన్నకి అర్ధం కాకున్నా, నాకు అర్ధమైంది. దానికి రెక్కలు మాత్రం తిరిగి ఇవ్వలేదు గాని స్వేఛ్చ మాత్రం ఇచ్చాను. ఆ దోమకి మా వీధి గుమ్మం చూపించాను. రెక్కలు లేని స్వేఛ్చ వద్దు అనుకున్నదేమో అది వెళ్ళలేదు. పెన్సిల్ తో తోశాను, అయినా వెళ్ళలేదు. ఈసారి ఊదేశాను. వెళ్ళిపోయింది.

గోడకి ఉన్న గడియారం గంట కొట్టింది. టైం తొమ్మిది గంటలు అయింది. తెలుగు టెక్స్ట్ బుక్ మళ్ళీ తీసుకొని చదవటం మొదలుపెట్టాను ...................................................................

"ఏరా చిన్నా .... లే ఇంక ... స్కూల్ కి టైం అవుతుంది .. పొద్దున్నే లేచి చదువుకోవచ్చు కదరా... ఈరోజు పరీక్ష ఉంది కదా" --పోలీసు గొంతు తో మా నాన్న

ఉలిక్కిపడి లేచాను!.

ఒక్క నిమిషం లో మొహం కడిగేసి, రెండు నిమిషాల్లో స్నానం చేసేసి, మరు నిమిషం లో దేవుడి పటం ముందు నిల్చున్నాను.

"దేవుడా ....ఏ రోజుకి ఆ రోజు నిన్ను కలుద్దాం అనుకుంటూనే ఉన్నాను
కాని రోజుకి ఇరవై నాలుగు గంటలే కావటం వల్ల అది కుదరటం లేదు
ఈ రోజు మాత్రం ఎన్ని పనులు ఉన్నా, చివరికి పరీక్షలు ఉన్నా, ఆ పరీక్షలకి
సమయం మించిపోతున్నా, నిన్ను కలవాలి అని వచ్చాను...దేవుడు లేడు
అనుకునే మనుషులకి నువ్వు ఉన్నావు అని చూపించాలి ...అలా చూపించాలి
అంటే నాకు నువ్వు ఫస్ట్ రాంక్ తెప్పించాలి ... పరీక్షకు టైం అయింది .. మళ్ళీ కలుద్దాం ...
ఇట్లు అప్పుడప్పుడు ఎల్లపుడు పూజించే మీ చిన్ని భక్తుడు.."

ఇస్త్రీ చేసి ఉన్న నా నీలం కలర్ లాగు , వైట్ కలర్ చొక్కా (మా స్కూల్ డ్రెస్) వేసుకొని, విబూది పెట్టుకొని, పక్క పాపిడి దువ్వుకొని అమ్మ తినిపిస్తున్న ఇడ్లీ తింటూ మా టేప్ రికార్డర్ లో పాటలు వింటున్నాను ...ఇది చూసి మా నాన్న కి కుళ్ళు పుట్టింది ... "ఏరా .... పరీక్ష కదా ... పుస్తకం తీసి చదువుకోవచ్చు కదా" అన్నారు మా నాన్న .

నేను : లేదు నాన్న గారూ... పరీక్షకి ముందు చదివితే చదివింది మరిచిపోతాం అంట ... అందుకే నేను ఎప్పుడూ అలాంటి తప్పు చేయను.
నాన్న గారూ నాకు ఈ లిస్టు లో ఉన్నవి కావాలి

నట్రాజ్ పెన్సిల్స్ -2
క్యామల్ ఎరేసర్ -1
షార్ప్‌నర్ -1
30 cms నట్రాజ్ స్కేల్ -1
ఫైవ్ స్టార్ చాక్లెట్స్ - 2

మా నాన్న : చాక్లెట్స్ ఎందుకు రా .....

నేను : రాస్తూ రాస్తూ అలిసిపోతే తినటానికి నాన్న గారూ ....

మా నాన్న : నువ్వు ఎంత సేపు రాస్తావు రా ....పది నిమిషలు అంతే కదా ....

ఏదైనా చేసి చూపించడం నాకు అలవాటు కాబట్టి మా నాన్న తో వాదించకుండా ఇడ్లీ తింటూ ఉన్నాను.
మా నాన్న అలా బయటకి వెళ్ళి నా లిస్టు లోవి అన్నీ తీసుకొచ్చారు.
పరీక్ష ప్యాడ్, ఈ లిస్టు లోవి అన్నీ బాగ్ లో వేసుకొని స్కూల్ కి వెళ్దాం అని బస్సు స్టాప్ కి బయలుదేరాను ....

Comments

  1. "ఎప్పుడో చిన్నపుడు నీ విద్యాభ్యాసం అప్పుడు చూసాను పుస్తకం పట్టడం...మళ్లీ ఇప్పుడే చూడటం కదా ....అందుకే కళ్ళలో నిరు నిండాయి ...సరిగా కనిపించలేదు"

    ఇదే కాదు, మొత్తం చాలా బాగుంది , కొంచెం తెలుగు తప్పులున్నాయి, సరి చేస్తే బాగుంటుంది

    ReplyDelete
  2. Pichekinchaaru.... soooper....
    కొంచెం తెలుగు తప్పులున్నాయి, సరి చేస్తే బాగుంటుంది.
    :)

    ReplyDelete
  3. You have great sense of humor. Carry on! :-)

    ReplyDelete
  4. చాలా బావుంది. దోమ ఎపిసోడ్ హ..హ..హ్హ....
    అక్షర దోషాలు సరి చేసుకోండి .

    ReplyDelete
  5. నన్ను ఉద్యోగం లోనుంచి తీసేస్తే అంతే మరి.

    ReplyDelete
  6. Waiting for next part desperately...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఛాలెంజి..ఛాలెంజి...ఛాలెంజి 4

ఛాలెంజి..ఛాలెంజి...ఛాలెంజి 1